Harassments-On-Women
https://teluguspirit.com/women-safety

Harassments : వేధింపులు ఆగాలంటే గొంతెత్తాల్సిందే!

భార‌త రెజ్లింగ్‌ స‌మాఖ్య(Wrestling Federation of India – WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్(Bhushan Sharan Singh) లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నాడని మ‌హిళా మ‌ల్ల‌యోధులు (wrestlers) కొంత‌కాలంగా చేస్తున్న ఆందోళ‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏళ్లుగా వేధింపులు కొన‌సాగుతున్నా ఓ బాలిక ఆరోప‌ణ తర్వాతే ఒక్కొక్క‌రుగా గొంతెత్తారు. ఇంత జ‌రుగుతుంటే అంత‌ర్జాతీయ స్థాయి పోటీల్లో వీరోచితంగా పోరాడి ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించి ప‌త‌కాలు సాధించుకొచ్చిన మ‌ల్ల‌యోధులు ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా భ‌రించార‌న్న‌ది అంద‌రినీ తొలిచే ప్ర‌శ్న‌. బ‌హుషా పురుషాధిక్య స‌మాజం (Male Dominated Society)లో పెర‌గ‌టం వ‌ల్ల‌నే కావొచ్చు – వారు కూడా అంద‌రిలాగే మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చారు. వాళ్లే కాదు.. మ‌హిళ‌లు, బాలిక‌లు గొంతెత్తితే స‌మాజంలో మ‌న చుట్టూ ఎంత మంది బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌లు ఉన్నారో తెలుస్తుంది. ఇలాంటి వేధింపులు ఆగాలంటే మౌనం వీడి గొంతెత్త‌డమొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని ప్ర‌తి మ‌హిళ‌, యువ‌తి, బాలిక గుర్తించాలి.

ఇంటా బయటా..
అన్న‌, మామ‌, బాబాయి.. ఇలా దగ్గరి వారిలా న‌టిస్తూ బాలిక‌ల‌తో చ‌నువు తీసుకునే కామాంధులు ఎంద‌రో ఉన్నారు.. త‌మ విద్యార్థుల‌ను క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. కొంత‌కాలం క్రితం హైద‌రాబాద్‌లోని డీఏవీ స్కూల్‌లో ప్రిన్సిప‌ల్ డ్రైవ‌ర్ ప‌సికూన‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘట‌న వెలుగుచూడ‌టం అంద‌రినీ క‌ల‌వ‌రానికి గురిచేసింది. జ‌డ్చ‌ర్ల ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు అక్క‌డి అధ్యాప‌కుడు కార‌ణ‌మయ్యాడు. ఇక ఆఫీసులు, ప‌రిశ్ర‌మ‌ల్లో చూపులు, మాట‌లు, చేత‌ల‌తో చేసే వేధింపులు స‌రేస‌రి. వీట‌న్నింటికి అమ్మాయిలు, మ‌హిళ‌ల‌ను వేధించ‌టం త‌మ హక్కు అన్న‌ట్లుగా పురుషాధిక్య స‌మాజంలో ఉండే ప‌శుప్ర‌వృత్తే కార‌ణం అవుతోంది. ఏం చేసినా మ‌హిళ‌లు, అమ్మాయిలు భ‌రించ‌టం అలాంట వారికి అవ‌కాశం ఇస్తోంది. బాహాటంగా వేధింపుల‌కు పాల్ప‌డే వారు చాలా త‌క్కువ‌. అంద‌రి ముందు హుందాగా ఉంటూ ఎవ‌రూ లేని స‌మ‌యంలో త‌మ అసలు రూపం బ‌య‌ట‌పెట్టేవాళ్లే ఎక్కువ‌. అందుకే అమ్మాయిలు, మ‌హిళ‌లు మారాలి. త‌ల్లిదండ్రులు కూడా త‌మ‌ అమ్మాయిల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌టంతో పాటు అబ్బాయిల‌ను సెన్సిటైజ్ చేయాలి.

క‌మిటీకి ఫిర్యాదు చేయాలి..
ప‌ని ప్ర‌దేశంలో లేదా ఆఫీసులో తోటి సిబ్బంది, య‌జ‌మాని నుంచి వేధింపులు ఎదురైన వారిలో 68.7 శాతం ఉద్యోగినులు బ‌య‌ట‌కు చెప్పేందుకు, ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్న‌ట్లు విమ‌న్స్ ఇండియ‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ స‌ర్వేలో తేలింది. సిబ్బంది వేధిస్తే యాజ‌మాన్యానికి లేదా అంతర్గ‌త ఫిర్యాదుల క‌మిటీ ( Internal Complaints Committee – ICC )లో ఫిర్యాదు చేయాలి. అక్క‌డ ప‌రిష్కారం కాక‌పోతే పోలీసుల‌(Police)ను ఆశ్ర‌యించాలి. అయితే సింహ‌భాగం కంపెనీలు(Companies), ప‌రిశ్ర‌మ‌లు(Industries) ఇలాంటి క‌మిటీల‌నే ఏర్పాటు చేయ‌టం లేదు. ఏర్పాటు చేసిన చోట అవి ఉన్నాయ‌ని కూడా ఉద్యోగినుల‌కు తెలియ‌టం లేదు. వాస్త‌వానికి ప‌రిశ్ర‌మ‌లు, కార్యాలయాల‌తో పాటు విద్యాల‌యాల్లో ఇలాంటి క‌మిటీలు ఏర్పాటు చేయించాలి. లేక‌పోతే ఏర్పాటు చేయాల‌ని కోరాలి.

ప్ర‌యాణాల్లో ఇలా..
బ‌స్సు(Bus), రైలు(Train) ప్ర‌యాణంలోనూ వేధింపులు ఎదుర‌వుతుంటాయి. వీలైనంత వ‌ర‌కు జ‌నం ఉన్న బ‌స్సులు, రైళ్ల‌లోనే ప్ర‌యాణించాలి. మ‌రీ ర‌ద్దీ ఎక్కువ‌గా, అసౌక‌ర్యంగా ఉండే వాటిలో ప్ర‌యాణించొద్దు. మ‌హిళ‌ల వ‌ద్ద సీటు దొరికేలా చూసుకోవాలి. లేదంటే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప‌క్క సీటులోని వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా, ఇబ్బందిక‌రంగా మాట్లాడినా, అసౌక‌ర్యం క‌లిగించినా వెంట‌నే హెచ్చ‌రించాలి. అయినా తీరు మార‌క‌పోతే గ‌ట్టిగా మాట్లాడాలి. బ‌స్సు, రైలు సిబ్బంది, తోటి ప్ర‌యాణికుల స‌హాయం తీసుకోవాలి. అవ‌స‌ర‌మైతే డ‌య‌ల్ – 100కు ఫోన్ చేసి షీ టీమ్ స‌భ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

విద్యాలయాలు, బ‌య‌ట‌..
విద్యాల‌యాల్లో, బ‌య‌ట వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేసేంద‌కు తెలంగాణ‌(Telangana State)లో షీ టీమ్స్(She Teams), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(AndhraPradesh)లో దిశ (Disha SOS) యాప్ ఉన్నాయి. విజ‌య‌వాడ పోలీసులు 4th Lion app అందుబాటులోకి తెచ్చారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్ లేదా యాప్ ద్వారా స‌మాచారం అందిస్తే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహ‌కారం అందిస్తారు. She Team QR Code స్కాన్‌ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.

తెలంగాణ‌లో పోలీసు స‌హాయ‌వాణి
బాధితులు పెద్ద‌లు – డ‌య‌ల్ –100
మైన‌ర్లు డ‌య‌ల్ – 100 / చైల్డ్ లైన్ – 1098
వేధింపులు వాట్సాప్ 9441669988
లైంగిక దాడి వాట్సాప్ 7382626437
గృహ‌హింస‌ వాట్సాప్ 9440700874
వేధింపులు వాట్సాప్ 9441669988
లైంగిక దాడి వాట్సాప్ 7382626437
గృహ‌హింస వాట్సాప్ 9440700874
విదేశాల్లో గృహ‌హింస / వేధింపులు 9440700911
పెళ్లి మోసం 9440700911
చైల్డ్ అబ్యూజ్ 7382626437
మిస్సింగ్ డ‌య‌ల్ – 100 / చైల్డ్ లైన్ – 1098

చిరునామా..
విమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ క్వార్ట‌ర్స్ (టీఎస్ పోలీస్‌)
ల‌క్డీ క‌పూల్‌, హైద‌రాబాద్ – 500004

వాట్సాప్ నంబ‌రు 9440700906
ఫోన్ నంబ‌రు 914027852246

womensafety-ts@tspolice.gov.in
womensafety.ts@gmail.com
tswomensafety.sp@gmail.com

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply