Review-of-Ramgopal-Varma-on-The -Fountainhead

Fountainhead : మిమ్మల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టే పుస్తకం ‘ఫౌంటేన్‌ హెడ్‌’

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో  ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ఒకటి.  అమెరికాకు చెందిన రచయిత్రి అయిన్‌ రాండ్‌ ఈ పుస్తకాన్ని రాశారు.  ఈ నవలను అమెరికా రచయిత్రి అయిన్‌ రాండ్‌ రాశారు. వార్నర్ బ్రదర్స్ సినిమాగా తెర కెక్కించారు. ప్రపంచం వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయిన, 20 భాషల పాఠకులు చదివిన ఈ పుస్తకాన్ని డా. రెంటాల శ్రీవెంకటేశ్వర రావు తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం ఆన్‌లైన్‌ ద్వారా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయిచేయొచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్‌గోపాల్‌ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.

”నేనిక్కడ ”ముందు వెనుక మాట”అనే హెడింగ్ ఉపయోగించడానికి కారణం, మీరీ మాట ఇప్పుడు చదివిన తర్వాత, పుస్తకం మొత్తం చదివి మళ్ళీ పేజీలు వెనక్కి తిప్పి ఇంకోసారి చదవమని అడగటానికి.

నన్ను కొందరు మేధావిననుకున్న సందర్భాలున్నాయి, మరి కొంతమంది పిచ్చివాడనుకున్న సందర్భాలున్నాయి..  కాని నేను మేధావిననుకునే వాళ్ళే మళ్ళీ నన్ను పిచ్చివాడనుకొని, నేను పిచ్చివాడిని  అనుకున్న వాళ్ళకి మళ్ళీ నేను మేధావినేమో అన్న అనుమానాలోచ్చిన సందర్భాలూ లేకపోలేదు.

  నేను నమ్మిందే చేస్తాను, నాకిష్టమైనట్టే బతుకుతాను కనుక ఈ పరిస్థితి వచ్చింది.

  పైన చెప్పినవే కాకుండా ఒక ముఖ్యమైన ప్రభావం మనం చదివిన పుస్తకాల మూలాన కల్గుతుంది. 

  అలా అయిన్ రాండ్  ”ఫౌంటెన్ హెడ్”   మొత్తం ఆలోచన విధానాన్ని మార్చి వేసిందంటే, దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు…

  నేను అచ్చంగా, నేనుగా మారటానికి విత్తనం వేసిన చెయ్యి అయిన్ రాండ్ ”ఫౌంటెన్ హెడ్”.

  అయిన్ రాండ్ లాంటి ఆలోచనలున్న మనిషి ఇంతవరకూ ప్రపంచ చరిత్రలో పుట్టలేదని నా ప్రగాఢ నమ్మకం.

  ఇది నేనెలా చెప్పగల్గుతున్నాంటే నేను నా ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టి ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోపు దాదాపు దేశవిదేశ ఫిలాసఫీలన్నింటినీ చదివేశాను.

 Immanuel Kant, Descartes, Socrates, Plato, Schopenhauer  మొదలగు వెస్టర్న్ ఫిలాసపర్లతో పాటు ఈస్టర్న్ ఫిలాసఫర్స్ ని కూడా చదివాను.

 దేశ ఫిలాసఫీలు ఎంతసేపూ ఎందుకూ పనికిరాని ఆధ్యాత్మికతని ఎక్కించడానికి ప్రయత్నిస్తాయి.  మన జీవనసరళిని ప్రభావితం చేయలేని ఈస్టర్న్ ఫిలాసఫీలు వట్టి దండగ. వాటిలా కాకుండా వెస్టర్న్ ఫిలాసఫీలు సమాజాల్ని, దేశాల్ని మార్చేశాయి.

 హెగెల్‌, Nietzsche ఫిలాసఫీలు జర్మన్‌ నాజి పార్టీకి వెన్నెముక కాగా… Marx, Engel  ఫిలాసఫీలు చైనా, రష్యాలని క్రియేట్‌ చేశాయి. 

 ఈస్టర్న్‌ ఫిలాసఫీలు కేవలం పనెగ్గొట్టి జపాలు చేసుకునే వాళ్లని మాత్రమే సృష్టించాయి.

 ఆడమ్‌ స్మిత్‌ ”వెల్త్ ఆఫ్ నేషన్స్” పుస్తకం అమెరికన్‌ పొలిటికల్‌ ఫిలాసఫీకి ఆయువు పట్టు. . అమెరికా ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్‌ కంట్రీగా ఎదగటానికి క్యాపటలిజం కారణం. అయితే ఆ క్యాపిటలిజంకి ఒక మోరల్‌ హై గ్రౌండ్‌ ఇచ్చింది అయిన్‌ రాండ్‌. 

  నేను అయిన్‌ రాండ్‌ని ఏకవచనంతో సంబోధించటం తనమీద ఉన్న అతిప్రేమ మూలాన.

  ప్రతి ఫిలాసఫీ ఇతరుల కోసం బతకాలి, దేశం కోసం బతకాలి అని అరచి గీ పెడుతుంటే, అయిన్‌ రాండ్‌ ఒక్కత్తే నీ కోసం, నీ స్వార్థం కోసం బతుకు అని చెప్పింది.. నీ స్వార్థంతో, నీ లాభం కోసం పని చేసుకుంటే దాని సైడ్‌ ఎఫెక్ట్ గా ఇతరులు కూడా లాభపడతారు. అంతే కాని కేవలం ఇతరుల కోసం బతికితే నీ బతుకు వల్లకాడై పోతుంది. అది నీకు, ఆ ఇతరులకి కూడా ప్రయోజనం ఉండదు అని చెప్పింది. 

  ఈ ఆలోచనా విధానం సడెన్‌గా వింటే ఎవరికైనా షాకింగ్‌గా ఉంటుంది కాని అలా అనడం వెనుక తన Extraordinary Analytical Powerని ఈ పుస్తకం ద్వారా రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గారు మీ ముందుంచారు.. ఆయనకి నా కృతజ్ఞతలు..

  అర్థం చేసుకునే బుర్ర, గుండెల్లో నిజాయితీ ఉన్న వాళ్లకెవరికైనా ‘పౌంటేన్‌ హెడ్‌’ చదివితే వాళ్ల జీవితాలు మారిపోతాయి. 

 ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ఒక పుస్తకం కాదు మన చుట్టూ ఉండే చాలామంది ఆలోచనల్ని నగ్నం చేసే ఒక ప్రక్రియ. 

 ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ఒకే ఒక రోజు నిశితంగా చదివితే చాలామంది జీవితాల్ని చదివిన అపార జ్ఞానం వస్తుంది.

  ‘ఫౌంటేన్‌ హెడ్‌’లోని పాత్రలు, వాటి స్వభావాలు నాకు తెలిసి కొందరు తెలుగు వాళ్లతో డిస్కస్‌ చేసినప్పుడు వాళ్లు కూడా ఆ పుస్తకాన్ని కొని తెచ్చుకునే వాళ్లు. ఏవో కొన్ని పేజీలు చదివి దానిని పడేసిన వాళ్లే ఎక్కువ. కొంతమంది కనీసం ఒక్క పేజీ కూడా చదవకపోయినా స్టేటస్‌ సింబల్‌గా ఇంట్లో పెట్టుకోవడం కూడా తెలుసు. 

  అఫ్ కోర్స్ చదివే ఆసక్తి ఉన్నా ఇంగ్లీషులో అంత ప్రావీణ్యం లేక చదివి ఉండకపోవచ్చు. 

  కొందరైతే ‘ఫౌంటేన్‌ హెడ్‌’ తెలుగులో వస్తే చదవగలం అనేవారు.  అది సాధ్యం కాని పని అనుకునే వాడిని నేను.. కాని ఇప్పుడు ‘ఫౌంటేన్‌ హెడ్‌’ని యథాతథంగా అనువదిస్తూ, ఏదీ మిస్‌ కాకుండా, అనువాదం చదువుతున్నామనే ఫీలింగ్ కలగకుండా రాసే చాలా కష్టమైన  పనిని రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా నిర్వర్తించారు. 

  ఈ ముందు వెనుక మాటకి, చివరి మాటగా నా ఒక అనుభవాన్ని మీతో షేర్‌ చేసుకోవాలి.

  కొన్ని సంవత్సరాల క్రితం  నేను ముంబైలోని నా అపార్ట్‌మెంట్ లో అయిన్‌ రాండ్‌ మీద తీసిన డాక్యుమెంటరీ ”ఎ సెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌” చూస్తూ ఉండగా అది చివరికొచ్చేసరికి నాకు తెలియకుండానే నా కళ్లెమ్మట నీళ్లు కారటం మొదలుపెట్టాయి.

  అవి తను పోయినందుకు వచ్చి న కన్నీళ్లు కాదు. తన ఆలోచనల్ని మనతో ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ద్వారా మిగిల్చి వెళ్లినందుకు నా ఆనంద భాష్పాలు.. అవే ఆలోచనల్ని ఇప్పుడు కొందరికి చేరాలని కృషిచేసిన రెంటాల శ్రీవేంకటేశ్వరరావు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. ”

 – రామ్‌గోపాల్‌ వర్మ

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply