Training-Programme-To-Pregnant-Ladies
Aaryajanani-Training-Programme

Aarya Janani : ధీర మాన‌వుల‌కు జ‌న్మ‌నిచ్చే ‘ఆర్య‌జ‌న‌ని’ అవుతారా?

సృష్టిలో అమ్మ స్థానం మహోన్న‌తం. ఎందుకంటే అమ్మ లేనిదే ఈ సృష్టే లేదు. అంత గొప్ప‌దైన మాతృత్వాన్ని పొంద‌టానికి త‌ల్లి ఓ త‌ప‌స్సే చేయాల్సి వ‌స్తుంది. పిల్ల‌ల‌ను పొంద‌టం భార్య‌భార్త‌ల క‌ల‌యిక ఫ‌లితంగా మ‌నం ఎంత మాత్ర‌మూ చూడం. పిల్ల‌లు దేవుడిచ్చే వ‌రంగా భావిస్తాం. అందుకే పిల్ల‌ల‌కు ప్ర‌సాద్ అని దేవీ ప్ర‌సాద్‌, రాంప్ర‌సాద్, శివ‌ప్ర‌సాద్ అంటూ పేర్లు పెట్టుకుంటాం. అందుకే త‌ల్ల‌లు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్ర‌త్త‌లేవో తెలియ‌జేయ‌డానికి, దేశానికి, ప్ర‌పంచానికి గొప్ప‌త‌రాన్ని అందించ‌డానికే హైద‌రాబాద్‌లోని రామ‌కృష్ణ మ‌ఠం ‘ఆర్య‌జ‌న‌ని’ పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్రమానికి శ్రీ‌కారం చుట్టింది. అనేక విలువైన విష‌యాలపై గ‌ర్భిణుల‌కు శిక్షణ ఇస్తోంది.

మ‌న ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి.. ?

ప్ర‌హ్లాదుడికి గురించి మ‌నకంద‌రికీ తెలిసిందే. అత‌డిని భ‌క్తుల్లోకెళ్ల గొప్ప భ‌క్తుడిగా భావిస్తాం.  ప్రహ్లాదుడు గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు అత‌డి త‌ల్లికి నార‌ద మ‌హ‌ర్షి నారాయ‌ణ‌మంత్రాన్ని ఉప‌దేశించారు. శ్రీ‌మ‌హావిష్ణువు మ‌హిమ‌ల‌ను వివ‌రించారు.  త‌ల్లిగ‌ర్భంలో ఉన్న‌ప్పుడు అందిన సంస్కారం వ‌ల్ల‌నే ప్ర‌హ్లాదుడు పుట్టుక‌తోనే విష్ణు భ‌క్తుడిగా మారాడు.  భ‌గ‌వంతుడు సృష్టిలో అణువ‌ణువునా ఉన్నాడ‌ని చాటి భక్తాగ్రేసరుడ‌య్యాడు. 

అర్జునుడు, శ్రీకృష్ణుడి చెల్లెలైన‌ సుభ‌ద్ర‌కు జ‌న్మించిన సంతానం అభిమ‌న్యుడు. మ‌హాభారతంలో అత‌డికి ఉన్న ప్రాధాన్య‌మేంటో అంద‌రికీ తెలిసిందే.  అభిమ‌న్యుడు సుభ‌ద్ర గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు ఆమెకు అర్జునుడు యుద్ధ తంత్రాలను చెప్పాడు. ప‌ద్మ‌వ్యూహం చెప్ప‌టం పూర్త‌య్యింది. అందులోంచి బ‌య‌ట‌కు వెళ్లే మార్గం చెబుతుండ‌గానే శ్రీ‌కృష్ణుడు అర్జునుడిని  బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. ఇదంతా గ‌ర్భస్థ శిశువుగా ఉన్న అభిమ‌న్యుడు విన్నాడు. ఆయ‌న జ‌న్మించాక కూడా ప‌ద్మ‌వ్యూహం నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం నేర్చుకోవ‌టం కుద‌ర‌లేదు.  అభిమ‌న్యుడు  గొప్ప యుద్ధ‌వీరుడై  మ‌హాభార‌త యుద్ధంలో పద్మ‌వ్యూహంలోకి ప్ర‌వేశించి కౌర‌వుల‌ను చీల్చి చెండాడాడు. కానీ అందులోంచి బ‌య‌ట‌ప‌డే మార్గం తెలియ‌క శ‌త్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.  ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు మ‌న పురాణేతిహాసాల్లో ఎన్నో ఉంటాయి. వాటిద్వారా తెలిసేదేంటంటే – గ‌ర్భంతో ఉన్నప్పుడు త‌ల్లి చేసే ప‌నులు, ఆలోచ‌న‌లు బిడ్డ‌పై చాలా ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని. సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటుంది. మొద‌టి 1000 రోజుల కాలం అంటే గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యం నుంచి రెండేళ్ల వ‌య‌స్సు వచ్చే వ‌ర‌కు బిడ్డ వ్య‌క్విత్వ నిర్మాణానికి పునాది ప‌డుతుంది. ఆ విలువైన కాలంలో బిడ్డ‌ల‌ను ఎలా పెంచాలి, ఎలాంటి వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌న్న‌ దానిపై త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. 


స్వామి వివేకానంద బోధ‌న‌ల స్ఫూర్తితో.. 

నా త‌ల్లిదండ్రులు రెండు సంవ‌త్స‌రాలు దైవ‌ప్రార్థ‌న చేసి న‌న్నీ ప్ర‌పంచంలోకి తీసుకువ‌చ్చారని స్వామి వివేకానంద అనేవారు.  సంస్క‌రవంతులైన త‌ల్లులు ఉన్న ఇళ్ల‌లోనే ఉన్న‌త‌మైన వ్య‌క్తులు జన్మిస్తారని కూడా చెప్పేవారు.  స్వామీజీ మాట‌ల స్ఫూర్తితో, దివ్య‌మాన‌వుల‌ను త‌యారుచేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆర్య‌జ‌న‌ని పేరుతో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని రూపొందించి నిర్వ‌హిస్తున్నారు.  ఇందులో స్వామీజీలు, మాతాజీలు, వైద్యులు ఇలా ఎంద‌రో భాగ‌స్వాములు అవుతున్నారు.  కార్యక్ర‌మానికి హాజ‌రైన వారికి భోజ‌న ఖ‌ర్చులు మాత్ర‌మే తీసుకుంటారు. 

శిక్ష‌ణ‌లో నేర్పించే అంశాలు ఇవే.. 

  • మ‌హిళ, మాతృత్వం ఔన్న‌త్యం, ప్ర‌పంచంలో స్త్రీ శ‌క్తి పాత్ర
  • మ‌న రుషులు ఏం చెప్పారు.. మ‌న శాస్త్రాల్లో ఏం ఉంది.. 
  • వివాహ‌మంటే ఏంటి..  బిడ్డ‌ల‌ను ఎందుకు క‌నాలి..  
  • బిడ్డ‌ను త‌ల్లిదండ్రులు  ఎలా చూడాలి..
  • బిడ్డ ఎలాంటి త‌ల్లిదండ్రుల‌ను ఎంచుకుంటుంది.. 
  • గ‌ర్భంలోని బిడ్డ‌తో తల్లి ఎలా మాట్లాడాలి.. 
  • కాలానుగుణంగా గ‌ర్భంలోని బిడ్డ ఎదుగులలో మార్పులు 
  • ఆయా ద‌శల్లో త‌ల్లి చేయాల్సిన ప‌నులు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు 
  • స‌త్సంగం, స్వాధ్యాయం,సంగీతం, భ‌జ‌న‌లు, దైవ‌ప్రార్థ‌న‌లు, ధ్యానం ప్రాధాన్యం
  • ఏయే యోగాస‌నాలు చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. 
  • ఇంటిలో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉండాలి..
  • మాన‌సికంగా ఎలాంటి స్థితిలో ఉండాలి.. 

ఇలా ఎవ్వ‌రూ చెప్ప‌ని, ఎక్క‌డా దొర‌క‌ని అనేక విష‌యాలు చెబుతారు..

శిక్ష‌ణ స‌మ‌యం – న‌మోదు ఎలా చేసుకోవాలి?

ప్ర‌తి నెలా 1వ శ‌నివారం శిక్ష‌ణ ఉంటుంది.  ఉద‌యం 9.00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు స‌మీప ప్రాంతాల వాళ్లు రామ‌కృష్ణ మ‌ఠానికి వెళ్లి శిక్ష‌ణ‌కు హాజ‌రుకావొచ్చు. దూర‌ప్రాంతాల వాళ్లు ఆన్‌లైన్‌లో కూడా హాజ‌రుకావొచ్చు. 

శిక్ష‌ణ తీసుకోవాల‌ని ఆస‌క్తి ఉన్న త‌ల్లులు www.aaryajanani.org లో వివ‌రాలు నమోదు చేసుకోవాలి. 

ఫోన్ నంబ‌రు 9603906906,  ఈ-మెయిల్ : aaryajanani9@gmail.com లోనూ సంప్ర‌దించ‌వ‌చ్చు. 

కొన్నిచోట్ల రామ‌కృష్ణ సేవాస‌మితుల ఆధ్వ‌ర్యంలోనూ శిక్ష‌ణ నిర్వ‌హిస్తున్నారు. స్థానిక రామ‌కృష్ణ సేవాస‌మితి కార్యాల‌యాల్లో సంప్ర‌దించవ‌చ్చు.

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply