Insurance : ఈ బీమా పథకాలు తీసుకున్నారా.. లేదా?

సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు బీమా పథకాల (Insurence Policies/Schemes) ను అమలు చేస్తోంది. ఒక సాధారణ బీమా పథకం కాగా, మరోటి ప్రమాద బీమా పథకం. చాలా తక్కువ ప్రీమియంతోనే వీటి తీసుకోవచ్చు.  ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా నమోదు చేసుకోవచ్చు. ఒకసారి నమోదు చేసుకుని ప్రీమియం (Premium) చెల్లిస్తే చాలు.  ఏటా ఆటోమేటిక్గా వాటికవే రెన్యూవల్ అవుతాయి.  ఇందుకోసం బ్యాంకు  ఖాతాలో ప్రీమియం చెల్లించేందుకు తగినంత నగదు నిల్వ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PRADHAN MANTRI JEEVAN JYOTI BIMA YOJANA – PMJJBY)
ఇది జీవిత బీమా పథకం. ఇందులో చేరితే సాధారణంగా చనిపోయినా, ప్రమాదవశాత్తు మృతిచెందినా నిర్ణీత బీమా మొత్తం రూ.2 లక్షలు నామినీ అందిస్తారు. ఈ పథకంలో చేరేందుకు 18 – 50 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు. ఇందుకు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా, ఆధార్‌ కలిగి ఉండాలి. బ్యాంకు, తపాలా శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకులు, తపాలా శాఖల వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయొచ్చు. జూన్‌ 1 నుంచి మే 31 వరకు ఎప్పుడైనా ఈ పథకంలో చేరొచ్చు. చేరే క్వార్టర్‌ (త్రైమాసికం) ను బట్టి ప్రీమియం మారుతుంది. ఆటో డెబిట్‌ ఆప్షన్‌ ను ఎంచుకుంటే ఏటా ఖాతా నుంచి ప్రీమియం చెల్లింపు దానికదే జరిగిపోతుంది. నిశ్చింతగా ఉండొచ్చు.

PMJJBY ప్రీమియం వివరాలు

త్రైమాసికంప్రీమియం
జూన్‌, జులై, ఆగస్టు రూ. 432
సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు రూ. 342
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి రూ. 228
మార్చి, ఏప్రిల్‌, మే రూ. 114

ప్రధాన్‌ మంత్రి సురక్షా బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana – PMSBY)
ఇది ప్రమాద బీమా పథకం. 18 – 70 ఏళ్లలోపు వారు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మే 31లోపు లేదా ఆరోజు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్‌ తప్పనిసరి. బ్యాంకుకు వెళ్లి లేదా బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రూ. 20 ప్రీమియం (Premium) చెల్లించాలి. ఆటో డెబిట్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే ఖాతా నుంచి ఏటా ప్రీమియం(Premium) చెల్లింపు జరిగిపోతుంది. పాలసీదారు ప్రమాదం వల్ల మరణిస్తే నామినీకి రూ. 2లక్షల బీమా పరిహారం అందిస్తారు. ప్రమాదంలో పూర్తిస్థాయిలో అంగ వైకల్యం ఏర్పడితే రూ. 2లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 1 లక్ష చొప్పున పాలసీదారుకు బీమా పరిహారం చెల్లిస్తారు.

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply