Inside : ముసుగులు తొడుక్కున్న మనుషులు!

ప్రతి మనిషి ముసుగు తొడుక్కునేవాడే. తన అంతరంగానికి, మాటలు, చేతలకు ఎంతో కొంత అంతరం ఉండే ఉంటుంది. అలాంటి ముసుగు చాటు అంతరంగ ఆవిష్కరణే ఇది..

నా ముఖానికి వేసుకున్న ముసుగును చూసి..
ఎవరూ మోసపోకండి
ముసుగులు నా దగ్గర చాలా ఉన్నాయి
ఒక్కటీ నా సొంతం కాదు

చెప్పటం మరచిపోయాను – నాటకీయత నా రెండో లక్షణం
నేను మీరందరికీ ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటాను..
అందరూ నా మంచిని గుర్తించాలని చాలా తాపత్రయపడుతుంటాను
ఏ క్షణానికి కావలసిన ముసుగును ఆ క్షణం తొడుక్కుంటుంటాను
మీరొకసారి తీక్షణంగా, సునిశితంగా చూస్తే చాలు
నా ముసుగు తొలగిపోతుంది
అందుకే మిమ్మల్ని అలా పరిశీలనగా చూడనివ్వను
కానీ మీకు తెలుసా?

అలా నా ముసుగు ముక్కలైతేనే..
నా నుంచి నేను బయటపడతాను
నేను నిర్మించుకున్న ఈ గోడల నుంచి బయటపడి
స్వేచ్ఛాజీవిని అవుతాను
అదే నా సమస్యలకు పరిష్కారం
కానీ ఈ విషయాన్ని మీకు చెప్పను
నాకు భయం.. ధైర్యం లేదు

నేను మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడతాను
అవన్నీ నా భావాలు అనుకుంటే తప్పే 
వాటిలో చాలా వరకు నేను ఆచరించను

నా ముసుగు తొలగిపోయిన మరుక్షణం
మీరు నన్ను గౌరవంగా చూడరని, నవ్వుతారని నా భయం
మీ నవ్వు నన్ను చంపేస్తుంది 
నాకు కాస్త దయ, గౌరవం కావాలి

నా లోపల అంతా శిథిలమే
అందుకే మీరు నన్ను నిరాకరిస్తారని నా భయం
ఆ కారణంగా నేను నాపై
నిరంతరం ఈ విధమైన తెర వేసుకుంటాను

ఈ తెరలోపల ఒక చిన్న పిల్లవాడు భయంతో వణికుతున్నాడు
ప్రేమ కోసం అర్రులు చాచుతున్నాడు
అభద్రతాభావంతో కొత్త ముసుగు వెతుకుతున్నాడు

నేను చెప్పేది వినకండి
నేను చెప్పనిది వినండి
చాలా వరకు అర్థమవుతాను

నిజానికి నేను అలా కనబడాలనుకుంటాను
నిజాయితీగా ఉండాలనుకుంటాను
మీరే నాకు చేయూతనివ్వాలి
నా ముసుగు తీసి కాల్చెయ్యడానికి
సహాయపడాలి

నేను మొదట దీనికి ఒప్పుకోను
ఓటమిగా భావిస్తాను
నన్ను మీరు అర్థంచేసుకున్నారని నమ్మకం కలిగించగలిగితే..
నెమ్మదిగా రెక్కలు విప్పి నా హృదయం
ఎగరడం ప్రారంభిస్తుంది

మీ అవగాహన నాకు ఊపిరినిస్తుంది
కాని అది అంత సులభం కాదు
ఎందుకూ పనికిరాని నా నిరర్థక భావాలు, చౌకబారు అభిప్రాయాలు
నా చుట్టూ బలమైన గోడలు కట్టాయి

కానీ మీ ప్రేమ అంతకన్నా బలమైనది అనుకోండి
నన్ను అర్థంచేసుకొని
జాగ్రత్తగా ఈ గోడలు బద్దలుకొట్టండి
నాలోని పసివాడు ఇంకెంతోకాలం ఈ నాటకమాడలేడు

నేనెవరో మీకు తెలుసా?
మీరు ఆశ్చర్యపోతారు
మీకు నేను బాగా తెలుసు
ప్రతి మనిషినీ నేనే..

షేర్ చేయండి. telugu spiritని చాటండి

Leave a Reply