అదో చిన్న పల్లెటూరు. పేరు లంబాడిపల్లి (Lambadipally). పదేళ్ల కిందట ఆ ఊరంటే జిల్లాలోనే చాలామందికి తెలియదు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారంటే అతిశయోక్తి కాదు. నిత్యం ఎంతో మంది కార్లు, వివిధ వాహనాల్లో లంబాడిపల్లిని చూడాలని ఆరాటంతో వస్తున్నారు. బీబీసీ (BBC), సీఎన్ఎన్ (CNN) వంటి అగ్ర రాజ్యాల మీడియా సంస్థలూ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ ఊరిని అందంగా ప్రపంచానికి చూపిస్తున్నాయి. అక్కడి ప్రజల విజయాలను ప్రపంచం నలుమూలలకు పరిచయం చేస్తున్నాయి. ఇంతటి మార్పు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ శ్రీరాం శ్రీకాంత్ (Sriram Srikanth). తన ఊరిలోని అందమైన దృశ్యాలు, కార్యక్రమాలు, సంస్కృతీ సంప్రదాయాలను కెమెరాలో బంధిస్తూ ఆయన మొదలు పెట్టిన ప్రయాణం ‘మై విలేజ్ షో యూట్యూబ్’ (My Village Channel) ఛానల్‌గా మలుపుతిరిగింది. ఇంతింతై అన్నట్లుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. గంగవ్వ (My Village Show Gangavva) వంటి నిరక్షరాస్యురాలైన సాధారణ మహిళా రైతు ప్రసిద్ధ యూట్యూబ్ స్టార్ గా ఎదిగేంత గొప్ప వేదికైంది ఆ ఛానల్. ఎంతో మంది ప్రతిభను వెలికితీస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇలా నేడు లంబాడిపల్లి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శ్రీకాంత్ ప్రస్థానం వివరిస్తాం పదండి..
తొలి అడుగులు..
శ్రీకాంత్ నాన్న శ్రీరామ్ మొండయ్య(Sriram Mondaiah) కరీంనగర్ డైట్ (Karimnagar Diet) కళాశాల ప్రిన్సిపల్. అమ్మ లక్ష్మి గృహిణి. ఎంటెక్ వరకు చదివిన శ్రీకాంత్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. వినూత్న ఆలోచనలు, కథలతో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ శంకర్(Director Shankar) అంటే ఎంతో అభిమానం. సృజనాత్మకత, గొప్ప కాల్పనికతతో రూపొందే హాలీవుడ్(hollywood) సినిమాలను ఎక్కువగా చూస్తూ స్ఫూర్తి పొందేవాడు. కరీంనగర్‌లో బీటెక్ చదువుతుండగానే మిత్రులతో కలిసి షార్ట్ ఫిల్మ్స్(Short Films) లాగా చిన్న చిన్న వీడియోస్ తీసేవాడు. సెలవులు, పండగ రోజుల్లో శ్రీకాంత్ నాన్న మొండయ్య స్వగ్రామం లంబాడిపల్లికి వస్తూ అక్కడి ఆర్య యూత్ అసిసోయేషన్(Arya Youth Association), డైట్ కళాశాల ఎన్ఎన్ఎస్(NSS) యూనిట్ ఆధ్వర్యంలో సేవా, చైతన్య, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. నాన్న వెంట ఊరికి వచ్చే శ్రీకాంత్ ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామి అయ్యేవాడు. అదే సమయంలో గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలు, మల్లన్న పట్నాలు, పీర్ల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకల ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేవాడు. లంబాడిపల్లి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పత్రికా కథనాలు వంటివన్నీ పొందుపరిచేందుకు https://lambadipally.blogspot.com/ అనే బ్లాగ్ ఉండేది.
గ్రామంలో అన్ని కుటుంబాలతో మరుగుదొడ్లు నిర్మించేలా ఉద్యమ రూపంలో శ్రమిస్తున్న సమయమది. చదువు ఆవశ్యకత, పొగాకు పదార్థాలు, మద్యపానం అనర్థాలపై కూడా విస్తృతంగా ప్రచారం చేసేది. ఏ కార్యక్రమం చేపట్టినా ఈ అంశాలు తప్పకుండా చర్చకు వచ్చేవి. ఇందులో భాగంగానే గాంధీ జయంతి (2011 అక్టోబర్ 02) సందర్భంగా లంబాడిపల్లికి చెందిన ఆర్య యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు తిరుపతి పెద్ది( Thirupathi Peddy ) మరుగుదొడ్ల ఆవశ్యకతపై ‘మరుగుదొడ్డి కట్టు మల్లన్నా ఓ మల్లన్నా‘ పాట రాశారు. మద్యం అనర్థాలపై చైతన్యం చేసేలా శ్రీకాంత్ ‘పల్లెటూరి కర్షకుడిగా‘ పేరుతో మరో పాట రాశాడు. ఈ రెండు పాటలను గ్రామానికి చెందిన కల్లెం రాజేందర్ ఆలపించగా శ్రీకాంత్.. మిల్కూరి అంజయ్య (Anji Mama), మిగతా మిత్రులతో తన వద్ద ఉన్న ఐప్యాడ్‌తో వీడియోలుగా చిత్రీకరించాడు. వీడియోలను పొందుపరిచేందుకు మరో బ్లాగ్ ఉండాలని శ్రీకాంత్ https://melukolpu.blogspot.com/ ఏర్పాటు చేశాడు. melukolpu పేరుతోనే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి అందులోనూ అప్‌లోడ్ చేశాడు. వాటికి చక్కని స్పందన వచ్చింది. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గంగవ్వ తొలిసారిగా నటించింది మరుగుదొడ్డి కట్టు మల్లన్నా పాటలోనే కావటం విశేషం. ఈ melukolpu యూట్యూబ్ ఛానలే తర్వాత ‘మై విలేజ్ షో’గా మారింది
లంబాడిపల్లికి మకాం..
విద్యాశాఖ నిర్వహించిన పోటీలో లంబాడిపల్లికి చెందిన చిన్నారులు మద్యం అనర్థాలపై చేసిన ఒగ్గుకథ ప్రదర్శన జాతీయ స్థాయి వరకు వెళ్లింది. ఈ ఒగ్గుకథకు కూడా దృశ్యరూపమిచ్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘మారునా నా గ్రామం’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఈ షార్ట్‌ఫిల్మ్ అన్నీ చూసి అధికారుల నుంచి ప్రశంసలు దక్కాయి. తర్వాత మరుగుదొడ్ల ఆవశ్యకతపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘కాలం మారింది..‘, ‘వారెవ్వా చందురన్నా‘ పాటలను కూడా గ్రామంలోని విద్యార్థినులు, మహిళల సహకారంతో వీడియో రూపమిచ్చి అప్‌లోడ్ చేశాడు. తర్వాత శ్రీకాంత్ సత్తుభాయ్ పేరుతో మరో పాట రాశాడు. దాన్ని పాట తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అప్పటికి కరీంనగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండేవాడు. విద్యాబోధన కూడా శ్రీకాంత్‌కు ఎంతో ఇష్టం. కానీ వైవిధ్యంగా, సృజనాత్మకంగా, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేలా విద్యావిధానం ఉండాలనేది ఆయన ఆకాంక్ష. క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు అనువుగా ఉండేది కాదు. ఇది ఆయనకు అసంతృప్తి కలిగించింది. దీంతో పూర్తిస్థాయిలో యూట్యూబ్ పై దృష్టిసారించాలని ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఒక్క ఐప్యాడ్ చేతపట్టుకుని లంబాడిపల్లికి వచ్చేశాడు. అమ్నానాన్నలు కరీంనగర్‌లోనే ఉన్నా శ్రీకాంత్ లంబాడిపల్లిలోనే ఉంటూ రకరకాల ప్రయోగాలు చేశాడు.
కొత్త కొత్త ప్రయోగాలు..
బర్గర్ తినమంటే గ్రామీణ మహిళలు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? స్పిన్సర్స్ చేతికి ఇస్తే ఏం చేస్తారు? హెడ్ ఫోన్ ను వారు ఎలా ఉపయోగిస్తారు, ఎలా ఫీలవుతారు వంటివన్నీ చూపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి “బాహుబలి”(Bahubali)) సినిమాని రూపొందించారు. గూగుల్ కార్డ్ బోర్డు సహాయంతో ‘బాహుబలి’ సెట్స్ కు సంబంధించిన వీఆర్ (virtual reality) దృశ్యాలకు గంగవ్వతో పాటు గ్రామంలోని మహిళలు స్పందించిన తీరును యూట్యూబ్‌లో పెట్టగా చాలా వైరల్ అయ్యింది. దీన్ని రాజమౌళి, రానా దగ్గుబాటి షేర్ చేయటంతో లక్షలాది మంది వీక్షించారు. ఆ తర్వాత ప్రేమమ్, కబాలి, బాహుబలి సినిమాల స్కూప్ వీడియోస్ తీశాడు. 2018లో కికి ఛాలెంజ్ (Kiki Challenge) స్ఫూర్తితో అనిల్ జీలా, పిల్లి తిరుపతి.. ఎద్దులు, జంబుతో పొలంలో దమ్ము చేస్తూ చేసిన విలేజ్ స్టైల్ కికి ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. బీబీసీలోనూ కథనం ప్రసారమైంది. ఇలా ఎప్పటికప్పడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. అందుకే మై విలేజ్ షో ఛానల్ యూనిక్‌గా నిలబడింది.
కలిసికట్టుగా అద్భుతాలు
లంబాడిపల్లికే చెందిన రాజు(Raju) రూపంలో అద్భుతంగా హావాభావాలు పండించే నటుడు దొరికాడు. తనతో పాటు బీటెక్ చదివిన మిత్రుడు శివకృష్ణ బుర్ర (Shiva) స్రిప్ట్ రాయటంతో పాటు బాగా నటిస్తూ అండగా నిలిచాడు. రాజు, గంగవ్వతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయటం ప్రారంభించాడు. వారికి డైట్ కళాశాల పూర్వ విద్యార్థి అనిల్ జీలా(Anil Geela) జత కలిశాడు. గంగవ్వ, రాజు, అనిల్ జీలా, అంజిమామ, శివకృష్ణ, గ్రామానికే చెందిన సిరిగిరి చంద్రమౌళి (My Village Show Chandu) కలిసి చేసిన షార్ట్‌ఫిల్మ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచిచూపాయి. గ్రామీణుల అమాయకత్వం, పల్లె వాతావరణం, అచ్చమైన తెలంగాణ యాస, జనరేషన్ గ్యాప్‌తో కుటుంబాల్లో ఏర్పడే సంఘర్షణ, ముఖ్యంగా గంగవ్వ తిట్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మై విలేజ్ షోకు అడిక్ట్ చేశాయి. తూట్ల పాయింటు, మతిమరుపు రాజు, బండి లేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్ వంటి షార్ట్ ఫిల్మ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. చాలా సినిమాలకు ప్రమోషన్ చేసే అవకాశం వచ్చింది. గంగవ్వ, అనిల్ జీలా పలు చిత్రాల్లో నటించారు. గంగవ్వ ఏకంగా బిగ్‌బాస్‌కూ ఎంపికై అందరినీ మెప్పించింది. అనిల్ కంటె (Anil atKante), వెంకట్ చింతకింది(Venkat Chinthakindi), గంగారెడ్డి కొట్టె (Gangareddy Kotte) స్క్రిప్ట్ తో పాటు వివిధ విభాగాల్లో సహకారం అందిస్తున్నారు. సినిమాను తలపించేలా తీసిన ‘హుషారు పిట్టలు‘ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘లేపుకపోతే‘ వెబ్ సిరీస్ ఇస్తున్నారు. ప్రస్తుతం మై విలేజ్ షో ఛానల్‌కు 25 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. శ్రీకాంత్ దగ్గర మధు, తిరుమల్ ఇలా.. 15 మంది వరకు పనిచేస్తూనే నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉపాధి పొందుతున్నారు. సొంతంగా సినిమాలు తీయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. శ్రీకాంత్ బృందం మై విలేజ్ షో వ్లాగ్స్, అనిల్ జీలా వ్లాగ్స్, మై విలేజ్ షో గంగవ్వ, కల్లివల్లి ఛానళ్లను కూడా నిర్వహిస్తోంది. వాటికి కూడా లక్షల్లో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. శ్రీకాంత్ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ర్టాల్లో అనేక విలేజ్ యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. లంబాడిపల్లిలోనూ కొందరు ఛానళ్లను పెట్టి రాణిస్తున్నారు.