singer-mangli
Photo Credit ; www.instagram.com/iammangli/

Mangli : స‌త్య‌వ‌తి నుంచి మంగ్లీ వ‌ర‌కు! స్ఫూర్తిదాయ‌కంగా నిలిచే సంగీత త‌రంగం ప్ర‌స్థానం

మంగ్లీ.. ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్‌. పొరుగు రాష్ట్రాల‌కు కూడా ఎంతో సుప‌రిచితం..  గాయ‌నిగా, వ్యాఖ్యాత‌గా, న్యూస్ ప్రెజంట‌ర్ ఇలా  వివిధ రూపాల్లో బహుముఖ ప్రజ్ఞ క‌న‌బ‌రుస్తూ కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న‌ ఈ యువ‌త‌రంగం అస‌లు పేరు స‌త్య‌వ‌తి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రాయ‌ల‌సీమ‌లో పుట్టిన మంగ్లీని ప్ర‌జ‌లు తెలంగాణ బిడ్డ‌లానే చూస్తారు.  అత్యంత సాధార‌ణ కుటుంబంలో పుట్టిన మంగ్లీ  అంచెలంచెలుగా ఎదిగిన తీరు, ఆమె వ్య‌క్తిత్వం  యువ‌త‌కే కాదు అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం. ఆమె ప్ర‌స్థానం తెలుసుకుందురు పదండి..

అండ‌గా నిలిచిన ఆర్డీటీ(RDT)

మంగ్లీ స్వ‌గ్రామం అనంత‌పురం(Anantapuram) జిల్లాలోని గుత్తి(Gooty) మండ‌లం బ‌సినేప‌ల్లి తండా(Basinepalli Tanda).  నిరుపేద బంజారా కుటుంబం ఆమె నేప‌థ్యం. తండ్రి బాల‌నాయ‌క్‌(Balanayak), త‌ల్లి లక్ష్మీదేవి(Lakshmidevi).  ఆమెకు ఇద్ద‌రు చెల్లెలు, త‌మ్ముడు శివ‌ ఉన్నారు. ఇంట్లో చెల్లెల‌ను చూసుకుంటూ, పొలంలో త‌ల్లిద్రండుల‌కు స‌హ‌క‌రిస్తూనే చ‌దివేది. మంగ్లీకి చిన్న‌ప్ప‌టి నుంచి పాట‌లంటే విప‌రీత‌మైన ఇష్టం.  పాఠ‌శాల విద్యార్థిని ద‌శ‌లో ఆమె అద్భుతంగా పాట‌లు పాడ‌టం అంద‌రినీ అబ్బుర‌ప‌రిచేది.   ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివిన ఆమె జీవితం రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ర్ (Rural Devolopment Trust – RDT) సంస్థ చేయూత‌తో మ‌లుపు తిరిగింది.  క‌ర‌వు, వెనుకబాటుత‌నానికి చిరునామాగా ఉన్న‌ అనంత‌పురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ స‌మాంత‌రం ప్ర‌భుత్వం అన్న‌రీతిలో సేవా కార్య‌క్ర‌మాలకు రూ. వంద‌ల కోట్లు నిధులు ఖ‌ర్చు చేస్తూ అక్క‌డి ప్ర‌జ‌లు  అభ్యున్న‌తికి కృషిచేస్తోంది. మంగ్లీ ప్ర‌తిభ‌ను గుర్తించిన ఆ సంస్థ‌ ప్ర‌తినిధులు వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించారు.  స‌మాజంలోని వివిధ స‌మ‌స్య‌ల‌పై వారు రూపొందించిన పాట‌ల‌ను మంగ్లీతో పాడించేవారు.  కానీ ఆమె పెరిగి పెద్ద‌య్యాక కూడా ఆమె వేదిక‌లు ఎక్కి పాడ‌టాన్ని తండాలో పెద్ద‌లు అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. అయినా ఆర్డీటీ, త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తుతో ముందుకే వెళ్లింది.  ఆర్డీటీ ఆర్థిక‌సాయం అందించి తిరుప‌తిలో క‌ర్ణాట‌క సంగీతం(Karnatic Music)లో శిక్ష‌ణ ఇప్పించారు. కుటుంబ ప‌రిస్థితుల‌తో చ‌దువు ఆపేయాల‌ని అనుకున్నా ఆర్డీటీ వాళ్లు న‌చ్చ‌జెప్పి  శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం(Sri Venkateswara University, Tirupati)లో మ్యూజిక్ లో డిప్లొమా కోర్సు  పూర్తిచేసేలా చేశారు.   ఆర్థికంగా త‌ల్లిదండ్ర‌లు ప‌డుతున్న‌ ఇబ్బందుల‌ను చూసి తాను ఏదో ఒక ప‌నిచేయాల‌ని హైద‌రాబాద్‌(Hyderabad)కు చేరింది.  బాచుప‌ల్లిలోని ఓ పాఠ‌శాల‌లో సంగీత ఉపాధ్యాయురాలిగా చేరింది.  ప‌ల్లెల్లోని ఆంక్ష‌ల‌ను దాటుకుని ఆక్షాంక్ష‌ను నెర‌వేర్చుకునేందుకు మంగ్లీ ఇంత సంఘ‌ర్ష‌ణ ఎదుర్కొంది.

తెలంగాణ ఉద్య‌మంలో వెలుగులోకి.. 

గాయ‌కుడు బిక్షునాయ‌క్(Bikshu Nayak) మంగ్లీ ప్ర‌తిభ  తెలుసుకుని త‌మ బృందంలో గాయ‌కురాలిగా చేర్చుకున్నారు.  కొద్దికాలం త‌ర్వాత వీ6లో జ‌రిగిన ఓ కార్య‌క్రమానికి హాజ‌రైంది.  ఈ సంద‌ర్భంగా ఛాన‌ల్ యాజ‌మ‌న్య‌మే ఆమెను యాంక‌ర్‌గా ప‌నిచేయ‌మ‌ని కోరింది.  అప్పుడు తెలంగాణ ఉద్య‌మం(Telangana Movement) ఉవ్వెత్తున ఎగ‌సింది. ఆ  స‌మ‌యంలో ఉద్య‌మంలో వీ6(V6) న్యూస్ ఛాన‌ల్‌గా కీల‌క పాత్ర పోషించింది. ఈ ఛాన‌ల్ తీన్మార్ న్యూస్‌తో అంద‌రికీ చేరువైంది. తీన్మార్ న్యూస్(Teenmar News)ను మ‌ల్ల‌న్న(Teenmar Mallanna – చింత‌కింది న‌వీన్‌), రాముల‌మ్మ (Ramyakrishna) ప్ర‌ధానంగా ప్ర‌జెంట్ చేసేవారు. ఇందులో స‌త్య‌వ‌తి మాట‌కారి మంగ్లీ(Matakari Mangli)గా ఎంట్రీ ఇచ్చింది.  ర‌మ్య‌కృష్ణ లేని రోజుల్లో తీన్మార్ న్యూస్ కూడా ప్రెజెంట్ చేసేది.  ఇలా స‌త్య‌వ‌తి పేరు మంగ్లీగా మారింది.  తెలంగాణ ఉద్య‌మంలో వేలాది పాట‌లు పుట్టుకొచ్చాయి.  టీవీ ఛాన‌ళ్లు, యూట్యూబ్ ఛాన‌ళ్లు కూడా  బతుక‌మ్మ‌, తెలంగాణ‌పై ప్రత్యేక పాటలు రూపొందిస్తూ ఆక‌ట్టుకున్నాయి.  మైక్ టీవీ(Mic TV), వీ6 ఛానళ్లు  రూపొందించిన పాట‌లు, కార్య‌క్ర‌మాల్లోమంగ్లీ తళుక్కుమంది. ఆమె గొంతు అంద‌రి హృద‌యాల‌కు హత్తుకుంది.  ఇలా ఆమెకు క్రేజ్‌ వ‌చ్చింది.  కొన్నాళ్లు మైక్ టీలో వ్యాఖ్యాత‌గా కూడా ప‌నిచేసింది.  యాంక‌ర్‌గా చాలామంది సినీ ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేసింది.  కానీ ప్రాణం లాంటి సంగీతానికి దూరం కావ‌టాన్ని ఆమె మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. అందుకే  ఛాన‌ల్ కార్య‌క్ర‌మాల‌కు స్వ‌స్తి ప‌లికి పూర్తిగా పాట‌ల‌కే అంకిత‌మైంది.  

యూట్యూట్‌లో ఛాన‌ళ్లు.. 

సినిమా పాట‌లు పాడుతూనే జాన‌ప‌దాలు, అధ్బుత‌మైన‌ భక్తిగీతాల‌ను ఆల‌పిస్తూ వీడియోలు రూపొందిస్తోంది. వీటిని మంగ్లీ అఫీషియ‌ల్‌(Mangli Official), స్పీక‌ర్‌(Speker), సౌండ్‌బాక్స్(Sound Box) యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లో అప్‌లోడ్ చేస్తోంది.  ఆధ్యాత్మిక గీతాలైతే అద్భుత‌మైన సందేశాన్ని ఇచ్చేలా ఉంటున్నాయి. ‘నా గురుడు న‌న్నింక యోగి గ‌మ్మ‌నెనే’ అన్న గీతం అద్భుతంగా పాడింది.  అంద‌రికీ బాగా తెలిసిన  పాల‌మూరు వాగ్గేయ‌కారుడు రామ‌స్వామి పాట ‘జాలే పోసిన‌వేమ‌య్యా’ అన్న పాటకు కూడా దృశ్య‌రూప‌మిచ్చింది. కోట్లాది మంది ఈ పాట‌ల‌ను వీక్షించారు.  

సినిమాల్లోనూ న‌టిగా.. : పాట‌ల‌తో అంద‌రి మ‌న‌సు దోచుకున్న మంగ్లీ ప‌లు చిత్రాల్లో నటించింది. లంబాడా ఆడ‌పిల్ల‌ల్ని కాపాడుకోవాల‌న్న సందేశంతో తీసిన గోర్ జీవ‌న్(2019) చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది.  ఉల్లాల ఉల్లాల(2020), గువ్వ గోరింక‌(2020), మాస్ట్రో(2021) చిత్రాల్లో న‌టించింది. ఆమె పాడుతున్న సినిమా పాట‌ల‌కూ అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో  ప్ర‌త్యేక స్థానం

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆమె హుందాత‌నం మ‌రింత గౌర‌వాన్ని తెచ్చిపెడుతోంది.   ఆమెను  రెండు తెల‌గు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు  ఆద‌రించాయి. అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం(International Women’s Day) సంద‌ర్భంగా 2020లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం(Government of Telangana ) విశిష్ట మ‌హిళా  పుర‌స్కారం అందించింది.  కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్‌లో స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్  ఆధ్వ‌ర్యంలో ల‌క్ష‌లాది మందితో జ‌రిగే శివ‌రాత్రి వేడుక‌ల్లో మంగ్లీ భ‌క్తిగీతాలు పాడే అవ‌కాశం ద‌క్క‌టం మ‌రో గొప్ప విష‌యం.  ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో గాయ‌నిగా ప‌రిచ‌యమైన మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి ఒక్క పాట‌తోనే పెను సంచ‌ల‌నం సృష్టించింది.  ఈ క్రెడిట్ కూడా మంగ్లీకి ద‌క్కుతుంది.  2022లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం(Government of Andhrapradesh ) మంగ్లీని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన  శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు  స‌ల‌హాదారుగా నియ‌మించింది.   చిన్న వ‌య‌స్సులోనే ఈ ప‌ద‌వి చేప‌ట్ట‌డం  గొప్ప‌ విషయమే.  సంక‌ల్ప బ‌లం, ప‌ట్టుద‌ల, కృషి ఉంటే  ఎంత పేద కుటుంబంలో పుట్టినా ఉన్న‌త శిఖ‌రాలు ఎదగ‌వ‌చ్చ‌ని చాటే మంగ్లీ జీవితం నుంచి ప్ర‌తి ఒక్క‌రూ స్ఫూర్తి పొందాలి. 

ప్రాచుర్యం పొందిన పాట‌లివే.. 

చిన్నీ మా బ‌తుక‌మ్మ                                     
బ‌తుక‌మ్మ పాట  2015
సింగిడిలో రంగులనే దోసితెచ్చి                       
  బ‌తుక‌మ్మ        2017
రేలారే.. రేలా.. రే..                                     
 తెలంగాణ పాట   2017
కురిసే వాన‌ల‌తో వాగుల‌న్నీ పారిన‌యీ             
బ‌తుక‌మ్మ       2018 
తెలంగాణ‌లో పుట్టీ, పూల ప‌ల్ల‌కి ఎక్కి               
బ‌తుక‌మ్మ 2019
మ‌బ్బూల మ‌బ్బూల లేచి  మ‌న ఊరికీ సెల్లెలా   
బతుక‌మ్మ     2019 
ఇదేరా తెలంగాణ ఉద్య‌మాల  ఇలాకా             
తెలంగాణ        2019 
ప‌చ్చిపాల వెన్న‌లా                                         
 బ‌తుకమ్మ     2019
ఆడ‌నెమ‌లి                                                 
 జాన‌ప‌దం         2020
వాడు న‌డిపే బండి రాయ‌ల్ ఎన్‌ఫీల్డు                 
జార్జిరెడ్డి  (చిత్రం)           2020
రాములో రాముల                                 
అల వైకుంఠ‌పురం(చిత్రం)  2020
ఊరంతా వెన్నెల బ‌తుకంతా..                          రంగ్‌దే (చిత్రం) 
 2021
దాని కుడీ భుజం మీద క‌డ‌వా..                     
ల‌వ్‌స్టోరీ(చిత్రం)  2021
ఊ అంతియా.. ఊ ఊ అంతియా (క‌న్న‌డ‌)           
పుష్ప‌(చిత్రం)    2021
చూడ‌బుద్ధి అయితాండి రాజిగో                           
 ధ‌మాక‌(చిత్రం)  2022
రా రా ర‌క్క‌మ్మ                                                   
విక్రాంత్ రోనా(చిత్రం)      2022
గిజ్జ‌గిరి తొవ్వ‌లోనా                                             జాన‌ద‌పం     2022
షేర్ చేయండి. telugu spiritని చాటండి