హిందువుల(Hindus)కు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam- TTD) అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా శ్రీవేంకటేశ్వరస్వామి(Sri Balaji)ని దర్శించుకోవాలని తపిస్తారు. దేశం నలుమూలల నుంచి వేలు, లక్షల్లో భక్తులు వస్తుంటారు. కానీ ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా అన్నిరకాల సేవలు అందుతాయి. అక్కడ చాలాసేవలు భక్తులే అందిస్తారు. ఇందుకు అవకాశం కల్పించే గొప్ప కార్యక్రమమమే – శ్రీవారి సేవ(Srivari Seaa). ఇది భక్తితో చేసే స్వచ్ఛంద సేవ. జీవితానికి గొప్ప అనుభూతిని అందించే శ్రీవారి సేవ కోసం దేశమంతటి నుంచీ భక్తులు దరఖాస్తు చేస్తుంటారు. 3, 4, ఏడు రోజుల పాటు తిరుమలలోనే ఉంటూ సేవలు అందించవచ్చు. ఇలా అవకాశం దక్కించుకున్నవారికి యాత్రికులు, సమ్మిళిత విభాగాల్లో తనిఖీలు, ఆరోగ్య సేవలు, అన్నప్రసాదం వడ్డన, ఉద్యానవనాల నిర్వహణ, లడ్డూ ప్రసాద వితరణ, రవాణా, కల్యాణకట్ట, పుస్తక విక్రయ కేంద్రాల్లో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు కేటాయిస్తారు.
నిబంధనలు ఇవే..
- శ్రీవారి సేవలో పాల్గొనే జట్టు సభ్యులందరూ తప్పక హిందూ మతస్థులై ఉండాలి. వయో పరిమితులూ ఉంటాయి.
- వారం రోజుల సేవలకు 18 నుంచి 60 ఏళ్ల వయో విభాగంలోని వారే దరఖాస్తు చేసుకోవాలి.
- 3, 4 రోజుల సేవల కోసం 18 నుంచి 50 ఏళ్లలోపు వారే దరఖాస్తు చేసుకోవాలి.
- వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, వేసవి సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ 18నుంచి 50 ఏళ్లలోపు వారినే అనుమతిస్తారు.
- ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు https://srivariseva.tirumala.org/#/ వెబ్ పేజీని ఓపెన్ చేయాలి.
- పుట్టిన తేదీ, ఫోన్ నంబరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
- కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఫోను నంబరు నమోదు చేసి పాస్ వర్డ్ పొందాలి.
- ఫోన్ నంబరు ధ్రువీకరణ తర్వాత లాగిన్ కు అవకాశం లభిస్తుంది. లాగిన్ అయ్యాక ప్రొఫైల్ కనిపిస్తుంది.
- బృందానికి మీరే నాయకులు / నాయకురాలు అయితే Apply for Teamlead ఎంచుకోవాలి.
- మీ జట్టు సభ్యుల వివరాలు నమోదు చేసేందుకు Team Details పై క్లిక్ చేసి Add New Sevak ను ఎంచుకోవాలి.
- జట్టు సభ్యుడు ఇప్పటికే శ్రీవారి సేవలో పాల్గొన్న భక్తుడు అయితే Add Existing Sevak అని ఎంచుకోవాలి.
- తర్వాత దరఖాస్తు విజయవంతమైందని పేజీలో చూపుతుంది.
- ఇదే సేవ చేస్తాను అని నిర్ణయించుకోవటం కుదరదు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా విధులు కేటాయిస్తారు.
- అన్ని బృందాలకు ఆలయంలో విధులు నిర్వహించే అవకాశం రాకపోవచ్చు. అన్నింటికి సిద్ధపడే దరఖాస్తు చేసుకోవాలి.
- గత 90 రోజుల్లోపు శ్రీవారి సేవలో పాల్గొని ఉంటే అవకాశం ఉండదు. 90 రోజులు గడువు ముగియాలి.