దేశంలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) అమలు చేస్తున్న అద్భుత ఆరోగ్య బీమా పథకం.. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PMJKAY) – ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat). ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు వరమని చెప్పాలి. రూ. 5 లక్షల వరకు విలువైన వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఈ పథకం ఆలస్యంగా అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం (Aarogyasri Scheme) అమలులో ఉండటంతో ఆయుష్మాన్ భారత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయలేదు. ఈ పథకం అమలవుతోందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. 99 శాతం జనాభా ఇంకా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోలేదు. అనుకోవచ్చు – ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, ఇంకా ఆయుష్మాన్ భారత్ ఎందుకని? కానీ ఈ రెండు పథకాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. ఆరోగ్యశ్రీ ముఖ్యంగా శస్ర్తచికిత్సలు అవసరమైనప్పుడే ఉపయోగపడుతుంది. అది కూడా రూ. 2 లక్షల లోపు అందే శస్ర్తచికిత్సలు, వైద్యానికి వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో సాధారణ వైద్య సేవలు కూడా పొందొచ్చు. రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులను ఈ పథకం ద్వారా పొందే వీలుంది. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా అర్హులైన వాళ్లంతా ఆయుష్మాన్ భారత్‌కు దరఖాస్తు చేసుకొని కార్డు పొందితే ఎంతో మేలు జరుగుతుంది. ఎలా నమోదు చేసుకోవాలో కింద చదవండి.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్‌లో చిత్రాలు
కావలసిన పత్రాలు, వివరాలు ఇవే..
గుర్తింపు కార్డు, వయస్సు ధ్రువీకరణ(ఆధార్ లేదా పాన్‌కార్డు), చరవాణి నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి చిరునామా, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ స్థితిగతులు తెలిపే ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
https://pmjay.gov.in/ వెబ్‌సైట్లో ‘Am I Eligible’ అని ఉన్నచోట క్లిక్ ఇవ్వాలి.
లాగిన్ పేరుతో ఓపెన్ అయిన చోట మొదటి గడిలో మీ చరవాణి నంబరును నమోదు చేయాలి.
తర్వాతి గడిలో కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
తర్వాత జనరేట్ ఓపీటీని క్లిక్ చేయాలి.
ఓటీపీ వచ్చాక నమోదు చేయాలి.
ఆ తర్వాత రాష్ట్రం, జిల్లాలను ఎంపిక చేసుకోవాలి.
తర్వాత పేరు / హెచ్‌హెచ్‌ఐడీ(హౌస్‌హోల్డ్ ఐడీ) నంబరు / రేషన్‌కార్డు నంబరును నమోదు చేసి సెర్చ్ చేయాలి.
వచ్చే ఫలితాలను బట్టి పీఎంజేఏవై (PMJAY) – Ayushman Bharat కింద తమ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.
మీరు అర్హులు అయితే కుడివైపు పేరు కనిపిస్తుంది.
ఆ తర్వాత దరఖాస్తు చేసేందుకు ‘Family Members’ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. వివరాలు నమోదు చేయండి.
దరఖాస్తు ప్రక్రియపై సందేహాలుంటే ఆయుష్మాన్ భారత్ కాల్ సెంటర్ నంబర్లు 14555 లేదా 1800 -111-565 లకు ఫోన్ చేయాలి.