సర్వపిండి(Sarva Pindi) ఎంతో రుచిగా ఉండే అచ్చమైన తెలంగాణ వంటకం(Telanaga Snack). ఇది కరీంనగర్(Karimnagar), జగిత్యాల(Jagtial) ప్రాంత ప్రజలకు అత్యంత ఇష్టమైన రెసిపీ(Recipe). ఇక్కడ వ్యవసాయ కుటుంబాల నుంచి ఉద్యోగుల వరకు సాయంత్రం పూట సర్వపిండి చేసుకుంటారు. క్రమంగా హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాలకు విస్తరించింది. దీన్ని ఖమ్మం, కోస్తా జిల్లాల వాళ్లు తపాల చెక్క, గిన్నప్ప అని కూడా అంటుంటారు. చిన్న చిన్న మార్పులతో చాలా రకాలుగా సర్వపిండి చేసుకోవచ్చు. కొందరు బియ్యం పిండిలో క్యాబేజీ(Cabbage)ని కలిపి కూడా సర్వపిండి చేసుకుంటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తయారు చేయటం కూడా సులువే.
కావలసిన పదార్థాలు (required ingredients)
బియ్యం పిండి (Rice Flour) | మూడు కప్పులు |
తరిగిన ఉల్లిగడ్డలు (Onions) | ఒక కప్పు |
వెల్లుల్లి పాయలు (Garlic Cloves) | రెండు గడ్డలు |
నువ్వులు (Seasame Seeds) | రెండు టేబుల్ స్పూన్లు |
దనియాలు (Coriander Seeds) | ఒక స్పూన్ |
కొత్తిమీర తురుము (Coriander) | నాలుగు స్పూన్లు |
జీలకర్ర (Cumin Seeds) | మూడు స్పూన్లు |
శనగపప్పు (Bengal Gram) | రెండు స్పూన్లు |
పచ్చిమిర్చి (Green Chilli) | ఆరు లేదా ఏడు |
కరివేపాకు (Coriander Leaves) | నాలుగు రెబ్బలు |
పల్లీలు(వేరుశనగ) (Peanuts) | పావు కప్పు |
నూనె (Oil) | తగినంత |
కారం పొడి (Chilli Powder) | కొద్దిగా |
ఉప్పు (Salt) | తగినంత |
ఉల్లి ఆకుల తురుగు (Onion Leaves) | కొద్దిగా |
తయారీ విధానం ఇలా..
శనగ పప్పును ముందుగా నానబెట్టాలి. పిండి కలిపే కంటే ముందుగానే పల్లీలను వేయించాలి. జిలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిని రుబ్బుకోవచ్చు. లేదంటే అలాగే వేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి వేసుకోవాలి. నానబెట్టిన శనగ పప్పు, పల్లీలు, రుబ్బుకున్న జిలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమం(పేస్ట్), సన్నగా తరిగిన ఉల్లి ఆకులు, చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కారంపొడి, తగినంత ఉప్పు, వక్కలుగా చేసిన దనియాలు (కొతిమీర్లు), పిండిలో కలపాలి. కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా అయ్యేవరకు కలిపి ముద్ద చేసుకోవాలి. తర్వాత మందంగా ఉన్న సర్వపిండి పాత్రని తీసుకోవాలి. పాత్ర అడుగున నూనె రాయాలి. ఆ గిన్నెలో ముద్దగా పిండిని తీసుకుని, మరీ సన్నగా కాకుండా, మందంగా కాకుండా ఒత్తుకోవాలి. అంచుల వద్ద పాత్ర ఎక్కువగా మందం ఉండదు కాబట్టి అక్కడ పలచగా ఒత్తుకోవాలి. మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని వాటిలో నూనె పోయాలి. అలా ఒత్తుకున్న గిన్నెను స్టౌవ్ మీద పెట్టి అన్ని వైపుల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తిప్పుతూ కాల్చటం వల్ల బాగా ఉడుకుతుంది. ఎక్కడా ఎక్కువగా మాడకుండా జాగ్రత్త తీసుకోవాలి. చక్కగా కాలింది అనిపిస్తే పాత్రను స్టౌవ్ నుంచి దించాలి. సర్వ పిండి చల్లారిన తర్వాత దాని బోర్లా వేసుకుంటే సర్వపిండి ఊడి వస్తుంది. అంతే సర్వపిండి రెడీ. మిగతా పిండితో కూడా ఇలాగే సర్వపిండి చేసుకోవాలి.