జాన్సన్ అండ్ జాన్సన్ Johnson & Johnson (J&J) అమెరికాకు చెందిన ఓ బహుళజాతి కంపెనీ. కానీ పల్లెటూళ్లలో కూడా ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే దశాబ్దాలుగా ఆ కంపెనీ ఉత్పత్తులను తమ పంచప్రాణమైన పిల్లలకు వాడారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్(baby powder), సబ్బు(baby soap), ష్యాంపూ(baby shampoo), నూనె(baby oil) తదితరాలు.. తల్లి పాలంత స్వచ్ఛమైనవన్నంతగా నమ్మారు. ఆయా ఉత్పత్తుల ప్రకటనలు చూసి అందులోని పిల్లల్లా తమ పిల్లలు సుకుమారంగా, ముద్దుగా తయారవుతారని మురిసిపోయారు. కానీ తేలిందేంటి – జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌లో కాన్సర్ కారక అస్బెస్టాస్(asbetos) ఉన్నాయని. ఇది యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఎవరిని నమ్మాలి.. ఏ ఉత్పత్తిని కొనాలనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
భారత్‌లో యథేచ్ఛగా అమ్మకాలు..
కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అస్బెస్టాస్(asbetos)తో కలుషితం కావటం క్యాన్సర్‌కు కారణమైందని విదేశాల్లో 38వేల వ్యాజ్యాలు కోర్టుల్లో వేశారు. వేలాది మంది చేసిన న్యాయపోరాటం చేయటంతో సంస్థ ఎట్టకేలకు దిగి వచ్చింది. అమెరికా, కెనాడలో 2020లోనే పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. కానీ భారత్ వంటి దేశాల్లో ఇంకా కొనసాగించటం తీవ్రంగా ఆందోళన కలిగించే పరిణామం. 2023లో ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత పౌడర్ విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది. కానీ అప్పటి వరకు జరిగే నష్టానికి బాధ్యులెవరు? కాన్సర్ వస్తుందని సంస్థకు ముందే తెలుసని, ఉత్తర కొరియాలో రెండేళ్ల కిందటే పౌడర్ అమ్మకాలను నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్ ఇతర దేశాల్లో కొనసాగించటం క్షమించరానిదని ఆ కంపెనీపై లా సూట్ వేసిన న్యాయవాది లీ ఓ డెల్ పేర్కొన్నారు. 1886 నుంచి మార్కెట్‌లో ఉన్న పెద్ద సంస్థ ఉత్పత్తులే ప్రమాదకరంగా ఉంటే ఇక ఎవరిని నమ్మాలి. .? ఏ కంపెనీ ఉత్పత్తులు కొనాలి.. ? ఇది అందరి మెదళ్లను తొలిచే ప్రశ్న. ప్రమాదకరమని తెలిసిన ఉత్పత్తులు కూడా ఇంకా రిలయన్స్, అపోలో వంటి అనేక స్టోర్లలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మడవుతూనే ఉన్నాయి. అమాయకులు కొంటూనే ఉన్నారు. ఈ సంస్థలకు నైతిక బాధ్యత లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
- ప్రముఖ కంపెనీ యూనీ లీవర్(Uniliver) చెందిన డవ్ ష్యాంపూ(Dove shampoo)ల్లోనూ క్యాన్సర్ కు దారితీసే రసాయనం బెంజీన్ ఉన్నట్లు తేలింది. ఈ పరిణామంతో సంస్థ అమెరికా మార్కెట్‌లోని డవ్(Dove)తో పాటు నెక్సస్(Nexxus), టిగీ, ట్రెస్మె, సువావే, ఎరోసోల్ వంటి బ్రాండ్ నేమ్‌లతో విక్రయిస్తున్న డ్రై ష్యాంపూలను ఉపసంహరించుకుంది. పేరు మోసిన నెస్లే (Nesle) కంపెనీ ఉత్పత్తులపై కూడా ఇలాగే చాలా ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. మ్యాగీ న్యూడుల్స్ (Maggi Noodles) విషయంలో తప్పును సంస్థ అంగీకరించింది. 2015లో ఈ విషయంలో దేశంలో పెద్ద దుమారమే లేచింది.
మార్కెట్‌ను శాసిస్తున్న ప్రకటనలు..
ప్రజలు ప్రకటనల ఉచ్చులో చిచ్చుకుపోయారు. టీవీల్లో వచ్చే ప్రకటనల్లో చెప్పే సుగుణాలన్నీ ఉన్నాయని గుడ్డిగా నమ్మడమే అన్ని అనర్థాలకు మూలం. ప్రకటనలు ఇవ్వలేకపోతే ఎంత మంచి ఉత్పత్తి అయినా ప్రజలకు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. రిటైల్ వ్యాపారులు కూడా టీవీల్లో ఎక్కువ ప్రకటనలు వచ్చే ఉత్పత్తులనే విక్రయిస్తున్నారు. ఇందులోవారి తప్పు కూడా ఏమీ లేదు. ఎందుకంటే – టీవీలో చూపించిన వస్తువులే కావాలని వినియోగదారులు అడుగుతున్నారు. అవి లేవు.. తమ వద్ద మంచి ఉత్పత్తులు ఉన్నాయి.. ఒకసారి వాడి చూడండి అంటే ఈ దుకాణంలో ఏవీ దొరకవు అని మరోసారి రారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు సృష్టించాయి. తమ స్ర్టాడజీతో సక్సెస్ అయ్యాయి. వాటిని నమ్మిన వినియోగదారులే ఓడిపోయారు.. మోసపోయారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఉదంతంతోనైనా మేలుకుంటే మేలు. కంపెనీ పేరు, బ్రాండ్, ప్రకటనలు చూసి గుడ్డిగా ఉత్పత్తులను వాడటం మానుకోవాలి. వీలైనంత వరకు నేచురల్ ఉత్పత్తులను వాడాలి.