పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే స్నాక్ పానీపూరి. సాయంత్రం ఎక్కడ చూసినా పానీపూరి బండ్ల వద్ద భారీగా నిలబడిన జనం కనిపిస్తుంటారు. ఎగబడి ఎగబడి తింటుంటారు. కానీ అక్కడి స్వచ్ఛతే ప్రశ్నార్థకం. వారు తయారు చేసిన ప్రాంతం చూస్తే మాత్రం ఎవరూ తినరని చెబుతుంటారు. ఇలా ఎక్కడో కొనుక్కొని తినేకంటే ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటే రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకోవటంతో పాటు డబ్బులూ ఆదా చేసుకోగలుగుతాం. అదెలాగో చదవండి.
పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
సూజీరవ్వ | ఒక కప్పు |
మైదా | పావు కప్పు |
ఉప్పు | తగినంత |
నీరు | గోరువెచ్చనివి |
మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు | ఉడికించినవి మూడు |
ఉల్లిపాయలు | కొన్ని ముక్కలు |
తెల్ల బఠానీలు | ఉడికించినవి సగం కప్పు |
కారం పొడి | ఒక టీ స్పూన్ |
జిలకర పొడి | సగం టీ స్పూన్ |
చాట్ మసాలా | సగం టీ స్పూన్ |
దనియాల పొడి | ఒక టీ స్పూన్ |
కొత్తిమీర | కొద్దిగా |
పానీ తయారీకి కావలసిన పదార్థాలు
కొత్తిమీర | కొద్దిగా |
పుదీనా | కొద్దిగా |
పచ్చిమిర్చి | నాలుగు |
అల్లం | చిన్న ముక్క |
చింతపండు రసం | ఒక కప్పు |
మిరియాల పొడి | టీ స్పూన్ |
పూరి తయారీ విధానం. .
ఒక కప్పు రవ్వ, నాలుగు స్పూన్ల మైదాను తీసుకోండి. మైదాకు బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. పూరి పొంగడం కోసం చిటికెడు వంట సోడాను కలపండి. అలాగే కొంచెం ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 10 – 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని రెండు భాగాలుగా చేసుకుని పెద్ద చపాతీలాగా చేయాలి. చపాతీ కొంచెం పలచగా ఉండాలి. ఇలా చేసుకున్న చపాతీని పానీపూరి సైజును బట్టి ఏదైనా బాటిల్ క్యాప్‌తో గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా చపాతీలాగా చేసుకుని పానీపూరి కోసం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుని కడాయి(బాండి)లో వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఒక్కో పూరిని వేసుకుంటూ కాల్చుకోవాలి. పూరీలను నూనెలో వేశాక జాడితో కిందకు నొక్కుతుండాలి. ఇలా చేస్తే పూరీలు బాగా పొంగుతాయి.
మసాలా తయారీ ఇలా..
ఉడికించిన మూడు బంగాళ దుంపలను ఒక గిన్నెలోకి తీసుకుని మెదుపుకోవాలి. అందులోనే ఉడికించిన తెల్ల బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, కారంపొడి, ఉప్పు, జిలకర పొడి, చాట్ మసాలా, దనియాల పొడి, కొత్తిమీర, అన్ని బాగా కలుపుకోవాలి.
పానీ తయారీ ఇలా..
ఒక గిన్నెలో ఒక కప్పు చింతపండును 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి పిండుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, పుదీనా, అల్లంముక్క, మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్నంతా చింతపండు రసంలో కలుపుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి ఒక్కోటి అర టీ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంతే.. అన్నీ రెడీ అయినట్లే. ఇక లాగించడమే తరువాయి.