ప్రాచీన కాలంలో మంత్రద్రష్టలైన ఋషులు
మునులు ఆ పరమేశ్వరుని
ఇంద్రుడు, యముడు, వాయుదేవుడనే పదాలతో
సూచించారు
వేదాంతులు ఆ మాటలతో వర్ణించలేమని
బ్రహ్మ అనే శబ్ధంతో సూచించారు
శైవులు శివుడని, వైష్ణవులు విష్ణువని,
బౌద్ధులు బుద్దుడని, జైనులు అర్హన్ అని,
సిక్కులు సత్ శ్రీ అకాల అని
పరమేశ్వరుని స్తుతిస్తారు
జగదీశ్వరుడైన ప్రభువును
కొందరు శక్తియని, కొందరు స్వామియని
కొందరు తల్లియని, కొందరు తండ్రియని
మరికొందరు కుమారస్వామియని
భక్తితో ప్రార్థిస్తారు
ఎవరెన్ని విధములుగా పిలిచినా
ఆ పరమేశ్వరుడు ఒక్కడే
అద్వితీయుడతడు
వేరెవరూ సాటి లేరు
సంస్కృత మూలం :
ఏకతా మంత్రం
యం వైదికా మంత్ర దృషపురాణః
ఇంద్రం యమం మాత రిస్వానమాహూః
వేదాన్తినోనిర్బచనీయ మేకం
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి
శైవాయమీశం శివ ఇత్య వోచన్
యం వైష్ణవా విష్ణు రితుస్తువన్తి
బుద్ధః స్తతాహర్న నితి బౌద్ధ జైన
సత్ శ్రీ అకాలేతి సత సిఖ్ఖ సంతః
శాస్తేతి కేచిత్ కతిచిత్ కుమారః
స్వామీతి మాతేతి పితేతి భక్త్యా
యం ప్రార్థయన్తే జగదీశితారం
స ఏక యేవ ప్రభురద్వితీయః
ఇక్కడ ప్లే చేసి ఏకతా మంత్రం వినొచ్చు
ఏకం సత్ విప్రాః బహుదా వదంతి – సత్యం ఒక్కటే అయినా జ్ఞానులు వివిధ పేర్లతో పిలిచారని ఋగ్వేదం చెబుతోంది. దేవుడు, సత్యం ఇలా పేరేదైనా విశ్వాన్ని నడిపే శక్తి ఒక్కటే. ఒకే చోటుకు వెళ్లేందుకు వివిధ మార్గాలు ఉన్నట్లే.. ఒకే దేవుడిని చేరేందుకు వివిధ మతాలు పుట్టాయి. ఒకే వ్యక్తిని ఒకరు తండ్రి, మరొకరు భర్త, ఇంకొకరు కొడుకు, సోదరుడు అని వివిధ వరసలతో పిలిచినట్లే దేవుడిని వివిధ పేర్లతో పిలుస్తున్నాం. ఈ సత్యం తెలిసినప్పుడు గందరగోళాలే కాదు.. మతాల గొడవే ఉండదు..